(క్రితంసారి నా వ్యాసాన్ని చూచి ఒక వ్యక్తి నేను సైతానునని తిట్టాడు. నాకు అతని మీద కోపం లేదు. ఇలా మీలో ఎంత మంది అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ నేను ఎందుకు ఈ టపాలు వ్రాస్తున్నానో చెబుతాను. మనందరికీ మన మతాల గురించి బాగా తెలుసు. మన మతాల్లో కొన్ని తప్పులు ఉన్నాయి. వాటివల్ల మన సమాజాలు ఎలాంటి అధోగతిలో పయనించాయో కూడా తెలుసు. అదే విధంగా ముస్లిములు కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు. నేను అందుకు కారణం ఏమైఉంటుందా అని ఆలోచించి వారి మతాన్ని చదువుదామనుకున్నాను. అందుకు ముందుగా నేను వారి ప్రవక్త అయినటువంటి మహమ్మదు యొక్క జీవితాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని తరువాత ఖురాను, మరియు ఇతర ముస్లిము పవిత్ర గ్రంథాలను చదివాను. వాటిలో నుంచి కొన్ని విషయాలను నేను వ్రాస్తున్నాను. నేను వ్రాస్తున్నవి కొన్ని ఇబ్బందికరమైన విషయాలని నాకు తెలుసు. అందుకు నేను పాఠకుడు కూడా వివరంగా నా టపాలలో నిజమెంతున్నది అని సులభంగా తెలుసుకోవడానికి నేను William Muir గారి పుస్తకంలో నుంచి వ్రాస్తున్నాను. నేను వ్రాసిన టపాలలో ఎక్కడయినా తప్పులు కనబడితే నాకు తెలిపిన నేను దానిని సరిదిద్దుకోగలను. నేను ముస్లిముల గురించి వ్రాయడానికి మరో కారణం ఖురానులో ఏముందో ముస్లిములలో కూడా అనేకులకు తెలియదు. ఖురాను ఇప్పటికీ మూసిఉంచిన పుస్తకంలాంటిది. అందరూ మనమతంలో వలనే ముస్లిము మతం కూడా ఉంటుందని అనుకుంటారు. అది కాదని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. నేను వ్రాసిన టపాలో ఏమైనా తప్పులు, లేక అబద్దాలు ఉన్నచో నాకు తెలిపిన సరిదిద్దుకోగలనని మనవి చేసుకుంటున్నాను. అవేశంతో కాకుండా నేను ఎక్కడ తప్పు వ్రాసానొ దాన్ని సరిదిద్ది మీ బ్లాగులలో, లేదా కామెంటులలో తెలిపిన నేను చాలా సంతోషిస్తాను.)
గమనిక: ఈ టపాలో విగ్రహాలను పూజించే మక్కావాసులను మక్కావాసులు అని సంబోధించడం జరిగింది. ముస్లిములు కూడా మక్కాలోనే ఉంటున్నప్పటికీ వారిని మాత్రం ముస్లిములని, ఇతరులను (వారి తెగతో సంబంధం లేకుండా) మక్కావాసులని సంబోధించడం జరిగింది. సహృదయంతో అర్థం చేసుకోగలరని భావిస్తూ………
క్రితం టపాలో జరిగినది: మహమ్మదును మరియు ఇతర ముస్లిములను మక్కావాసులు వెలివేసారు. కానీ కాబాకు ప్రతీ సంవత్సరం జరిగే ఉత్సవాలకు మాత్రం రానిచ్చేవారు. ఇలా మూడు సంవత్సరాలు గడిచాక మక్కావాసులు ముస్లిములపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. అప్పటికి మహమ్మదుకు యాభైసంవత్సరాలు. ఇక చదవండి.
మహమ్మదుపై నిషేధాన్ని ఎత్తివేసిన తరువాత అతనిని మక్కావాసులు ఏమీ అనలేదు. ఇలా నిషేధాన్ని ఎత్తి వేయడానికి అబూ తాలీబు ఎంతో సహాయం చేసాడు. అప్పటికి తాలీబు వయస్సు ఎనభై సంవత్సరాలపైనే. కానీ అతనిపై నిషేధాన్ని ఎత్తివేసిన కొన్ని నెలల తరువాత మహమ్మదు భార్య ఖదీజా మరణించింది. అది మహమ్మదుకు వ్యక్తిగతంగా తొలి దెబ్బ. మహమ్మదుకు ప్రేమ, ఆస్తి, ప్రవక్త అని నమ్మకం (Confidence of being a prophet), కష్టకాలంలో రక్షణ, సంతానం, ఇలా అన్నీ ఇచ్చిన వ్యక్తి ఖదీజా. అలాంటి ఆమె చనిపోవడం మహమ్మదును ఎంతో బాధించింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు ఖదీజా మరణించిన అయిదు వారాల తరువాత అబూ తాలీబు కూడా మరణించాడు. ఇలా తనకు అన్నీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులు వరుసగా చనిపోవడంతో మహమ్మదుకు చాలా కష్టమయిపోయింది. అప్పటికి మహమ్మదు యొక్క పిల్లలందరూ (కుమార్తెలు మాత్రమే, కుమారులు ఎవ్వరూ బతికిలేరు ఒక్క జయీదు తప్ప) తమ భర్తల వద్దకు వెళ్ళిపోయారు. మిగిలినది ఫాతిమా మాత్రమే. అమె అప్పటికి ఇంకా చిన్నపిల్ల. అప్పటి సమాజంలో బహుభార్యత్వం, బహుభర్తృత్వం సామాన్యమే అయినా మహమ్మదు ఖదీజా బ్రతికి ఉన్నంత వరకూ ఇతరులు ఎవ్వరినీ పెళ్ళి చేసుకోలేదు(Pg 102). అబూ తాలీబు చచ్చిపోతూ తనను ముస్లిముగా మారకుండా ఖొరేషియా తెగ వారు అడ్డుకున్నారని మహమ్మదుతో చెప్పడని ముస్లిము రచయితలు చెప్పారు. కానీ తాలీబు జీవితాంతం ప్రవర్తించిన విధాన్ం, ఎన్ని కష్టాలకు ఎదురైనా నిలబడిన తత్వాన్ని బట్టి మనం అతను తన కుమారుడైన మహమ్మదును కాపాడుకోవడానికి ఎంతో కష్టపడ్డాడనీ, మరియు అతనికి ఎప్పుడూ ముస్లిముగా మారే ఆలోచనలేదనీ స్పష్టంగా అర్థమవుతుంది. తాలీబు విగ్రహాదేవతలను ఆరాధిస్తూ పుట్టినవాడు, అలాగే చాచ్చిపోవాలనుకున్నాడు, అలాగే చచ్చిపోయాడు. కానీ మహమ్మదుకు ఎంతో సహాయం చేసాడు. అబూ తాలీబు చనిపోవడంతో మహమ్మదుకు బధ్దశత్రువైన అబూ లహాబుకు ఎందుకో మహమ్మదు మీద జాలి కలిగింది. మహమ్మదును తాను జీవితాంతం కాపాడుతానని చెప్పాడు కానీ కొన్నాళ్ళ తరువాత ఖొరేషియా తెగవారు అతనిని తమ వైపు తిప్పుకోగలిగారు. అప్పటి వరకు మక్కావాసులు ఒక్క తాలీబును చూచి మాత్రమే మహమ్మదుకు కీడు తలపెట్టకుండా ఆగారు. అలా అబూ లహాబు మారగా, అతనిని తిడుతూ ఒక సురాను మహమ్మదు వెలువరించాడు. ఆ సురా ఇక్కడ: (pg:104)
ఈ సమయంలో వెలువడ్డ సురాలన్నీ (సందేశాలు) కాస్త హింసను ప్రేరేపించేవిగా ఉన్నాయి. ఇప్పుడు మహమ్మదు పరిస్థితి కాస్త విషమంగా తయారయ్యింది. తాను మక్కాలో ఉన్నత స్థాయికైనా ఎదగాలి లేదా ఆ పోరాటంలో ప్రాణాలయినా కోల్పోవాలి. ఇస్లాము విగ్రహఆరాధకుల చేతిలో పరాజయం పొందాలి లేదా విగ్రహఆరాధకులు ఇస్లాము చేతిలో పరాజయం పొందాలి.
ఇప్పుడు మహమ్మదు ఆలోచించడం మొదలుపెట్టాడు. గత నాలుగు సంవత్సరాలుగా చెప్పుకోదగ్గ ప్రముఖలెవ్వరినీ తన మతంలోకి ఆకర్షించలేకపోయాడు. చిట్టచివరిగా తన మతంలోకి మారిన వారు ఒమర్ మరియు హమ్జా, అది కూడా మూడు నాలుగు సంవత్సరాల ముందు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న పట్టణాలవైపు చూడగా అందులో చెప్పుకోదగ్గ పట్టణం తయీఫు (తరువాత మదీనాగా పేరు మారింది). అది తొంభై, వంద కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. మహమ్మదు తన కొడుకు జయీదు మరియు జోనాహ్ లను తీసుకుని తయీఫు పట్టణం వెళ్ళాడు. అక్కడ ఆ పట్టణపు పెద్దలయిన ముగ్గురు సోదరులవద్దకు వెళ్ళి కొంచెం సహాయం చేయమని ఆడిగాడు. తయీఫు పట్టణవాసులకు మక్కావాసులంటే ఈర్ష్య వారికి పలుకుబడి ఉన్న దేవతలు కలవారనీ, కాబా గుడి ఉన్నదని. కానీ వారు మహమ్మదుకు సహాయం చేయడానికి సంకోచించారు. వారు నిరాకరించారు. అప్పుడు మహమ్మదు తను అక్కడికి వచ్చినతట్లు మక్కాలోవారికి చెప్పవద్దు అని అన్నారు. దానికి తయీఫు వాసులు సంకోచిస్తూ అంగీకరించారు (pg: 105). ఎవరూ సహాయం చేయకపోవడంతో తయీఫు పట్టణంలో పది రోజులు ఉండి ఇస్లాము మతం గురించి ప్రచారం చేసాడు, కానీ ఎవ్వరూ ముస్లిములుగా మారలేదు (pg:106).
తరువాత మహమ్మదు తన స్వంత పట్టణానికి తిరిగివచ్చినా బయటే ఉండిపోయాడు. తను పట్టణంలోకి వెడితే చంపుతారనే భయంతో తన ప్రాణానికి హామీ ఇవ్వవలసిందిగా పట్టణపెద్దలను రెండుసార్లు అహ్వానించాడు. కానీ ఎవ్వరూ అంగీకరించలేదు. మూడోసారి తనపై నిషేధాన్ని ఎత్తివేయడానికి సహాయం చేసిన ముతాయిం అనే పెద్దమనిషిని సాయం అడిగాడు. అందుకు ముతాయిం అంగీకరించి తన పిల్లలను తోడుగా తీసికొని మహమ్మదును పట్టణంలోకి తీసుకువచ్చాడు (pg: 108). ఇలా మహమ్మదు యొక్క తయీఫు ప్రయాణం విఫలమయింది.
మహమ్మదు ఖదీజా చనిపోయిన మూడు నాలుగు నెలల తరువాత సావ్డా అనే విధవను వివాహం చేసుకున్నాడు. సావ్డా సక్రాన్ అనే ముస్లిము యొక్క భార్య. అతను అబిస్సీనియా నుంచి మక్కాకు వస్తున్న దారిలో మృతిచెందాడు. సావ్డాను వివాహం చేసుకున్న సమయానికి కాస్త అటూ ఇటుగా అబూ బక్ర యుక్క కుమార్తె అయిన అయేషాను కూడా వివాహం చేసుకున్నాడు. అలా అబూ బక్రకు మహమ్మదుకు మధ్య మిత్రత్వం మరింత దృఢంగా మారింది. మహమ్మదు ఆయేషాను వివాహం చేసుకునేటప్పుడు మహమ్మదు వయస్సు యాభై కానీ ఆయేషా వయసు ఆరు లేక ఏడు ఉండవచ్చు (pg: 109-110). వీరిరువరి వివాహం మూడు సంవత్సరాల తరువాత (అప్పుడు ఆయేషా వయసు తొమ్మిది) జరిగింది. ఈ విషయంపై ముస్లిములలోనే అనేక వాదోపవాదాలు ఉన్నాయి, ఆయేషాతో వివాహం గురించి తరువాత ఒక టపాలో వివరంగా చెబుతాను. కానీ ఒక్కటి మాత్రం నిజం, మహమ్మదు చనిపోయిన తరువాత అయేషా అనేక సంవత్సరాలు జీవించింది, అందుకే అనేక సురాలు ఆమె పేరు మీద ఉంటాయి. ఇస్లాంలో ఆయేషా పాత్రమీద సున్నీ షియా మతస్థులు విడిపోయారని అంటారు.
ఈ సంవత్సరం కాబా ఉత్సవాలలో కొత్తగా వచ్చిన వారిలో కొందరిని మహమ్మదు తన మతంలోకి మర్చుకోగలిగాడు. ఒకసారి మహమ్మదుకు ఒక కల వచ్చింది. దాని సారాంశం ఇది. తనను గేబ్రియేలు రెక్కలగుర్రం మీద జెరూసలేంలోని గుడి వద్దకు తీసుకువెళ్ళినట్లు, అక్కడ ముందటి ప్రవక్తలందరూ తనను ఆహ్వానించినట్లు, అక్కడినుంచి ఒకదానిపై ఒక స్వర్గంగా ఏడవ స్వర్గం వరకు వెళ్ళినట్లు కలగన్నాడు. ఆ కలలో మహమ్మదుకు అల్లా ఏడవ స్వర్గంలో కనబడ్డాడు. అప్పుడు అల్లా తన భక్తులందరూ ప్రతీరోజూ యాభైసార్లు తనకు ప్రర్థనలు చెయ్యాలని ఆదేశించాడు. దానికి మహమ్మదు సరేనని ఒప్పుకొని తిరిగివస్తుండగా ద్వారం వద్ద వేచిచూస్తున్న గేబ్రియేలు అల్లా ఏమి చెప్పాడని అడిగాడు. దానికి మహమ్మదు జరిగినది చెప్పాడు. అప్పుడు గేబ్రియేలు “రోజుకు యాభైసార్లంటే కష్టం కదా కొంచెం తగ్గించమని అడుగు”, అని మహమ్మదుకు చెబితే అప్పుడు మహమ్మదు సరేనని వెళ్ళి అల్లాను అడిగాడు. అందుకు అల్లా సరే రోజుకు నలభైఅయిదు సార్లు ప్రార్థనలు చేయమని చెప్పాడు. మహమ్మదు తిరిగివస్తుండగా ద్వారం వద్ద గేబ్రియేలు ఆపి మళ్ళీ తగ్గించమని అడుగమని చెప్పాడు. ఇలా ప్రతీసారి అల్లా అయిదు తగ్గిస్తూ చివరకు రోజుకు అయిదుసార్లు ప్రార్థనలు చెయ్యాలని ఆదేశించాడు. ఈ సంఘటనను మహమ్మదు ఇతరులకు చెప్పగా మక్కావాసులు నవ్వారు, ముస్లిములు చాలా సంతోషించారు. ఇదే సమయంలో మహమ్మదు తమ దేవతలను తిట్టకపోవడంతో మక్కావాసులు మహమ్మదును ఇబ్బంది పెట్టే కార్యక్రమాలను ఆపేశారు. ఇప్పుడు ఒక్కసారి చిన్న సురాను చూద్దాం.

Sura is from Pg:121
ఈ సురాలో మనం గమనించవచ్చు అల్లా తనను నమ్మని వాళ్ళపై పగ తీర్చుకుంటాడని. కానీ తన సృష్టిలో భాగమైన వారే కదా ఆ మనుషులు కూడా, కానీ అదేంటో అల్లా కేవలం నమ్మనందుకు పగ తీర్చుకుంటానని మహమ్మదు చేత చెప్పించాడు.
మహమ్మదు యొక్క మదీనాపట్టణపు ప్రయాణం విఫలమయిన తరువాత కాబా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు మదీనాలో ఉండే బానీ కజ్రాహ్ తెగకు చెందినవారు ఏడుగురు మహమ్మదుతో ముస్లిములుగా మారుతున్నట్లు చెప్పారు. అప్పుడు వారు తీసుకున్న శపథాన్ని Pledge of Acaba అంటారు. వారు తమ తెగ వద్దకు తిరిగివెళ్ళాక వారి తెగలో మహమ్మదు గురించి ప్రచారం చేశారు. తరువాతి సంవత్సరం మొత్తం పన్నెండు (వీరిలో ఏడుగురు క్రితం సంవత్సరం వచ్చినవారే) మంది బానీ కజ్రాహ్ తెగవారు ముస్లిములుగా మారారు. అప్పుడు మహమ్మదు ముస్లిములలో ఒక వ్యక్తిని ఆ తెగవద్దకు పంపాడు. మూడవ సంవత్సరం ముసిములుగా మారడానికి డెబ్బయిరెండు మంది వచ్చారు. వారందరూ ఒకసారి చీకటిలో కలిసారు. వారందరూ అప్పుడు మహమ్మదుకు తమ మద్దతును ఇస్తున్నట్లు శపథం చేసారు. దీనిని Second pledge of Acaba అంటారు. మహమ్మదు ఇలా రహస్యంగా ముస్లిములను కలిసాడని, ముస్లిముల జనాభా పెరుగుతోందనీ మక్కావాసులకు అర్థమయ్యింది. వారు కాబా గుడి వద్ద విడిదిచేసిన అన్ని తెగలవారి వద్దకు వచ్చి మహమ్మదుగురించి అడిగారు. కానీ అత్యధికులకు ఏమి జరుగుతుందో అర్థం కాలేదు, తెలిసిన మదీనాముస్లిములు ఏమీ మాట్లాడలేదు. అందరితోపాటు వీరు కూడా తిరిగి తమ గృహాలకు వెళ్ళిపోయారు.
అలా మదీనాలో కాస్త మద్దతు దొరకగానే మహమ్మదు ముస్లిములను మదీనాకు వలసవెళ్ళమని చెప్పాడు. అలా వలస చాలా రహస్యంగా జరిగింది. ఖొరేషియా తెగవారికి అనుమానం వచ్చింది ఇళ్ళకు ఇళ్లకు ఖాళీ అయిపోవడం చూసి. కానీ వరు ముస్లిములు తమను వీడి వెళ్ళిపోతున్నారని ఆనందించారే కానీ ముందు జరుగబోయేది ఏమిటో ఊహించలేకపోయారు. చివరికి అందరికీ అనుమానం బాగా బలపడి మహమ్మదును సంహరిద్దామని అనుకున్నారు. ఈ విషయం మహమ్మదుకు తెలిసింది. వాళ్ళు అందరూ ఒక గుంపుగా బయలుదేరి మహమ్మదు ఇంటికి వెళ్ళారు. వారి రాకను పసిగట్టిన మహమ్మదు తన మిత్రుడైన అబూ బక్ర ఇంటికి వెళ్ళి అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళడానికి సిద్దపడ్డారు. కానీ తాను అలా వెడితే చుట్టుపక్కల వారికి అనుమానం వస్తుందని ఆలీని తనలాగా నటించమని చెప్పాడు. ఆలీ మహమ్మదు యొక్క బట్టలు వేసుకొని మహమ్మదు పడుకొనే గదిలో నిద్రపోతున్నట్లు నటించాడు. మహమ్మదు లేకపోవడం గమనించిన మక్కావాసులు తమకు వ్యతిరేఖంగా తమను తప్పుడు దోవ పట్టించిన ఆలీని ఏమీ చేయలేదు సరికదా ఇతరులకొరకు తన ప్రాణాలను అర్పించడానికి సిద్దమైనందుకు మెచ్చుకున్నారు. మహమ్మదు మక్కా బయట ఒక కొండగుహలో తన మిత్రునితో కలసి కొన్నాళ్ళు వేచిచూసాడు. మక్కావాసులు మహమ్మదును వెతకమని పంపించిన వారు ఎంత వెతికినా మహమ్మదు తీసుకున్న జాగ్రత్తలవల్ల మహమ్మదు వారి కంటపడలేదు. మహమ్మదు ఉన్న గుహ వద్దకు వారు బాగా చీకటి పడ్డాక వచ్చారు. వారికి చీకటిలో కనబడక వారు వెనుదిరిగారు. ఈ సంఘటనను ముస్లిములు చాలా గర్వంగా అల్లా దయవలననే మహమ్మదు తప్పించుకున్నాడని చెబుతారు. మహమ్మదు ఉన్న గుహను ఒక సాలీడు పూర్తిగా కప్పేసిందనీ ఇంకా వారి ఊహాత్మక శక్తితో నింపివేసారు. ఈ సంఘటనలు జరిగేప్పటికి మహమ్మదు వయసు యాభైమూడు. మదీనా దరిదాపులకు వచ్చాక మహమ్మదును వెతకమని పంపినవారిలో ఒకడు మహమ్మదును గమనించాడు. కానీ తను ఒక్కడు, వారు నలుగురు. అందుకే తను మక్కా వెళ్ళినతరువాత అక్కడ తనవారితో ఏమీ చెప్పలేదు. మహమ్మదు మక్కా విడిచిన మూడురోజుల తరువాత ఆలీ మక్కాను వీడి మదీనా వెళ్ళాడు. ఆలీని కానీ, అబూ బక్ర యొక్క కుటుంబసభ్యులను కానీ, మహమ్మదు కుటుంబసభ్యులను కానీ మక్కావాసులు ఏమీ చేయలేదు. వారిని ప్రశాంతంగా మదీనా వెళ్ళనిచ్చారు. మక్కావాసులకు మహమ్మదుమీద, అతని అనుచరులమీదా ఎంత కోపం ఉందనేది దీనిని బట్టి అర్థం అవుతోంది. వారు కేవలం తమ దేవతలను తిట్టాడని మహమ్మదు మీద కోపం తప్పించి ప్రత్యేకంగా అతని మీద కోపం ఏదీ ఉన్నట్లు మనకు కనబడదు.
వనరు: William Muir, Life of Mahomet, printed: 1891 (పేజీ నంబర్లతో సహా ఇవ్వబడింది. అనుమనం ఉన్నవారు ఈ పుస్తకంలో నేను నంబరు ఇచ్చిన పేజీలో చదువగలరు)
(వచ్చేవారం: మదీనాలో ప్రవక్త)